శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు..రికార్డు బ్రేక్ ఆదాయం

శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు..రికార్డు బ్రేక్ ఆదాయం

కర్నూలు: శ్రీశైల మల్లన్నకు హుండీ లెక్కింపు ద్వారా రికార్డు బ్రేక్ ఆదాయం వచ్చింది. కరోనాకు మునపటి దినాల పరిస్థితిని గుర్తుకు తెస్తూ.. ఆదాయం భారీగా రావడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సాధారణంగా శివరాత్రి, ఉగాది, దసరా, సంక్రాంతి సర్వదినాల మాసాల్లో మాత్రమే శ్రీశైల మల్లన్నకు హుండీ ద్వారా భారీ ఆదాయం వచ్చేది. అయితే ఈసారి ఎలాంటి పండుగలు.. పబ్బాలు.. పర్వదినాలు లేని సమయాల్లో పర్వదినాలకు మించిన ఆదాయం రావడం విశేషం. 
శ్రీశైల మల్లన్న క్షేత్రంలోని ఉభయదేవాలయాల హుండీని మంగళవారం లెక్కించారు. సీసీ కెమెరా నిఘా మధ్య దేవస్థానం సిబ్బంది, వాలంటీర్లు లెక్కింపులో పాల్గొన్నారు. దేవస్థానం ఈవో కేఎస్ రామారావు, సెక్యూరిటీ ఆఫీసర్ తదితరులు దగ్గరుండి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. మొత్తం గత 27 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా 3 కోట్ల 28 లక్షల 23 వేల 979 రూపాయల నగదు వచ్చింది. అలాగే 455 గ్రాముల బంగారం, 7 కేజీల 230 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చాయి. కరోనా మహమ్మారి వచ్చాక దేవస్థానం ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితి ఎదురవుతుందేమోనన్న ఆందోళనకర పరిస్థితులను అధిగమిస్తూ.. పర్వదినాలను మరిపించే రీతిలో ఆదాయాన్ని భక్తులు సమర్పించడం నిజంగా ఆ మల్లికార్జునుడి చలవేనని ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రామారావు పేర్కొన్నారు.